అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vakkaaya | వర్షాకాలంలో మెట్ట ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ తోటలు, చేను గట్లపై విరివిగా కనిపించే వాక్కాయ పండ్లు చాలా మందికి సుపరిచితమే.
ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ రంగుల కలయికతో నోరూరించే ఈ పండ్లను, ఉత్తర తెలంగాణలో వాక్కాయ అని, దక్షిణ తెలంగాణలో కలిమె పండ్లు లేదా కలేక్కాయ అని పిలుస్తారు. రుచిలో కాస్త వగరు, ఎక్కువ పులుపు ఉండే ఈ పండ్ల ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
కలిమె పండ్లు: ప్రాంతీయత, లక్షణాలు ,ఉపయోగాలు.. కలిమె పండ్లు (వాక్కాయ) తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల్లోనూ విరివిగా లభిస్తాయి.
ఈ పండ్లు ముళ్లు ఎక్కువగా ఉండి, ఎత్తుగా పొదలా పెరిగే చెట్లకు కాస్తాయి. వీటిని తోటల చుట్టూ పెంచి అటవీ జంతువులు రాకుండా అడ్డుకోవడానికి కూడా ఉపయోగిస్తారు.
Vakkaaya | ప్రధాన ఉపయోగాలు:
నిల్వ పచ్చళ్ళు: ఈ కాయలను చింతపండుకు బదులుగా ఉపయోగిస్తారు. పప్పులో వేయడంతో పాటు రోటి పచ్చళ్లు, ఆవకాయ, పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చడి కూడా పెడతారు.
స్వీట్‌పాన్ అలంకరణ: పాన్ షాపుల్లో స్వీట్ పాన్ పైన టూత్‌పిక్‌కు గుచ్చి ఉండే ఎర్రని పండ్లు ఇవే. చాలా మంది వీటిని చెర్రీస్ అనుకుంటారు, కానీ ఇవి వాక్కాయలే.
టూటీ ఫ్రూటీ: ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేస్తారు. వీటిని కేకులు, సలాడ్ల అలంకరణలోనూ ఉపయోగిస్తారు.
Vakkaaya | వాక్కాయ ఆరోగ్య ప్రయోజనాలు:
వాక్కాయల్లోని పోషకాలు, ఔషధ గుణాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. దీనిలో విటమిస్లు, పీచు పదార్థం, పెక్టిన్, ట్రిప్టోఫాన్లు ఉంటాయి.
దీనిలో ఉండే విటమిన్ బీ, సీ, ఐరన్ రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పీచు పదార్థం (Fiber)కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, అజీర్తి సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.
పెక్టిన్ (కార్బోహైడ్రేట్) జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది.
ట్రిప్టోఫాన్ (అమైనో యాసిడ్) ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది, సెరటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహకరిస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్ సీ అధికంగా ఉండటంతో పాటు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇతర ప్రయోజనాలు: శ్వాసకోశ పరిస్థితులను మెరుగుపరచడం, చర్మ వ్యాధులకు చికిత్స చేయడం, మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా కూడా సహకరిస్తాయి.