అక్షరటుడే, ఇందూరు : MP Arvind | అమృత్ పథకం కింద భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా వేగంగా పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో (District Collectorate) మంగళవారం దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Central Government) మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు.
MP Arvind | ఎంపీ లాడ్స్..
ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేసేందుకు పలువురు కమిషన్లు డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ అన్నారు. ఈ ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. ఆర్వోబీ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే పీఎం విశ్వకర్మ పథకం (Vishwakarma Scheme) కింద అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలులో జిల్లా రెండో స్థానంలో ఉందని, ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు.
MP Arvind | తిలక్‌గార్డెన్‌లో బినామీలే వ్యాపారం..
నగరపాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాల్లో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్‌కు చెల్లించే నామమాత్రపు అద్దె సైతం ఏళ్ల తరబడిగా కట్టడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. మడిగలను సబ్ లీజ్‌కు ఇచ్చి రూ.వేలల్లో తీసుకుంటున్నారని వాపోయారు. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ వివరణ ఇస్తూ.. ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపామని, నిబంధనల కనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అద్దె పెంపు, రద్దు ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయన్నారు. పులాంగ్ వాగు నిర్వహణ గురించి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఎక్కడికక్కడ కబ్జాలు జరుగుతున్నాయని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. కబ్జాదారులపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఎంపీ అర్వింద్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
MP Arvind | భారీ వర్షాల వల్ల..
భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దిశా కమిటీ సభ్యులు కోరగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) స్పందించారు. సీజీజీ ఆధ్వర్యంలో ఇసుక తొలగింపు ప్రక్రియను త్వరలోనే జరిపిస్తామని తద్వారా రైతులకు తోడ్పాటును అందించడమే కాకుండా జిల్లా యంత్రాంగానికి నిధులు కూడా సమకూరుతాయని కలెక్టర్ తెలిపారు. ఆయాభివృద్ధి పనులను ప్రభుత్వం నుంచి మంజూరీలు లభించిన నేపథ్యంలో నిర్మాణ పనులు జరిపించే విషయంలో జాప్యం జరగకుండా సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా స్థల సమస్య నెలకొంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇప్పటికే పలుచోట్ల ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల కోసం స్థలాలను కూడా కేటాయించామన్నారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించబడిన స్థలాలు కబ్జాకు గురయితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, దిశ కమిటీ సభ్యులు ఆశన్న, లింగం, విజయ తదితరులు పాల్గొన్నారు.