అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరు దేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది.
ఉక్రెయిన్ ఆదివారం రష్యాపై డ్రోన్ దాడి చేసింది. రష్యాలోని కుర్క్స్ అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఇంధన ఎగుమతి టెర్మినల్‌లో రియాక్టర్ సామర్థ్యం తగ్గిందని, భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Drone Attack | పలు డ్రోన్లను కూల్చేశాం
ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని దాదాపు 12 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసినట్లు రష్యన్ అధికారులు తెలిపారు. దాదాపు 95 డ్రోన్లను కూల్చివేశామన్నారు. ఉక్రెయిన్ (Ukraine) సరిహద్దు నుంచి 60 కి.మీ. దూరంలో ఉన్న కుర్స్క్ అణు విద్యుత్ కేంద్రం (Nuclear power plant)పై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ప్లాంట్‌లో ఓ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైందని, మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అయితే అణు విద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదంతో ఎలాంటి రేడియేషన్ వెలువడటం లేదని స్పష్టం చేశారు. డ్రోన్ దాడులతో ఎవరికీ గాయాలు కాలేదన్నారు.
రష్యా ఉత్తర లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలోని ఉస్ట్-లుగా ఇంధన ఎగుమతి కేంద్రంపైనా దాడి జరిగింది. ఈ ఓడరేవుపై కనీసం 10 డ్రోన్‌లను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఒక భారీ బాల్టిక్ సముద్ర ఇంధన ఎగుమతి టెర్మినల్, ప్రాసెసింగ్ కాంప్లెక్స్. రష్యాకు భారీ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఇంధన కేంద్రంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. దాడులపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు. అయితే ఇటీవల రష్యా జరిపిన దాడులకు ప్రతిగా రష్యాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.