అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madras High Court | తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగం అని పేర్కొంది.
ఉదయనిధి స్టాలిన్ 2023లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెంగీ, మలేరియాతో పోలుస్తూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. అయితే దానిపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు (BJP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమిళనాడు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే ఆయన వ్యాఖ్యాలను విమర్శిస్తూ సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసినందుకు బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవ్య (Amit Malviya)పై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాలవ్యపై నమోదైన కేసును కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Madras High Court | వారిని వదిలేస్తున్నారు..
విద్వేషపూరిత ప్రసంగాలను ప్రారంభించిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, అటువంటి ప్రసంగాలపై స్పందించిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని కోర్టు తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైనప్పటికీ, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదని కూడా హైకోర్టు ఎత్తి చూపింది. ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించిన పదజాలం జాతి నిర్మూలనను సూచిస్తుందని, విద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ‘సనాతన ఒళిప్పు’ అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి నిర్మూలన లేదా సాంస్కృతిక నిర్మూలన అని అర్థం అని పేర్కొంది. ఇటువంటి పరిస్థితులలో మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ చేసిన పోస్ట్ విద్వేషపూరిత ప్రసంగం కిందకు రాదని స్పష్టం చేసింది.