అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Navy | భారత నావికాదళం చరిత సృష్టించింది. ఒకేసారి రెండు స్టెల్త్ ఫ్రిగేట్లను ప్రారంభించింది. మంగళవారం విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు నావికాదళంలోకి రెండు మల్టీ-మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లు INS ఉదయగిరి, INS హిమగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) లాంఛనంగా ప్రారంభించారు.
నేవీ అత్యాధునిక ప్రాజెక్ట్ 17Aలో భాగమైన ఈ రెండు యుద్ధనౌకలు నేవీని మరింత బలోపేతం చేస్తాయి. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (Mazagon Dock Shipbuilders Limited), కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE) అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ నౌకలు శత్రువుల కంటికి చిక్కకుండా తమ పనిని చేసుకుపోతాయి. “రెండు అత్యాధునిక పోరాట వేదికలు భారత నావికాదళ (Indian Navy) నౌకాదళంలో చేరాయి. ఇవి సముద్రంలో భారతదేశ బలాన్ని బలోపేతం చేస్తాయి” అని నేవీ ’X‘లో పోస్టు చేసింది.
Indian Navy | ఆధునిక పోరాట వ్యవస్థలు..
దాదాపు 6,700 టన్నుల బరువు ఉన్న ఈ ఫ్రిగేట్లు శివాలిక్-క్లాస్ కంటే 5 శాతం పెద్దవి, మెరుగైన స్టెల్త్ లక్షణాలు, తగ్గించబడిన రాడార్ క్రాస్-సెక్షన్, అధునాతన పోరాట వ్యవస్థలను కలిగి ఉన్నాయి. సముద్ర గర్భంలో, ఉపరితలం మీద, ఆకాశంలో శత్రువులు ఎక్కడ ఉన్నా నేలకూల్చగల సామర్థం వీటి సొంతం. ముఖ్యంగా, INS ఉదయగిరి నేవీ యుద్ధనౌక డిజైన్ బ్యూరో (Warship Design Bureau) రూపొందించిన 100వ నౌక. ఇది ఐదు దశాబ్దాల స్వదేశీ రూపకల్పనలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశ రక్షణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ స్థాయిని ప్రతిబింబిస్తుంది, 200 కంటే ఎక్కువ MSMEలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
