అక్షరటుడే, కామారెడ్డి : SP Kamareddy | జిల్లాలో షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు కూడా మైనర్లు కావడం గమనార్హం. ముఠా అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) వెల్లడించారు.
SP Kamareddy | నాలుగు షట్టర్లు ధ్వంసం చేసి..
కామారెడ్డి పట్టణంలో ఈనెల 8న నాలుగు షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడటంతో పాటు రెండు బైక్‌లు చోరీకి గురైన ఘటనపై జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 13న మరోసారి కామారెడ్డికి (Kamareddy) వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిఘా వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిని విచారించగా నలుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి రాత్రి పూట, తెల్లవారుజామున ఎవkp లేని సమయంలో మెయిన్ రోడ్లపై తాళం వేసి ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్టుగా తేలింది.
SP Kamareddy | ఇద్దరు కాపాలాగా ఉంటే..
చోరీల సమయంలో నిందితులు ఇద్దరు కాపలాగా ఉంటే.. మిగిలిన వారు మాస్కులు, గ్లౌజులు ధరించి ఇనుప రాడ్లతో షటర్లను పైకిలేపి లోపలికి ప్రవేశించి నగదు, వస్తువులు దొంగిలించి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న బైక్‌లపై పారిపోతున్నట్టుగా విచారణలో వెల్లడైంది. నలుగురిలో మహారాష్ట్ర (Maharashtra) హింగోలి జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మరొక ఇద్దరిలో ఏ1 సోను పిరాజ్ పవార్, ఏ2 అనికేతన్ జాదవ్‌లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సోను పిరాజ్ అనేక మందిని ముఠాలుగా ఏర్పాటు చేసినట్టుగా తెలిసిందన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టయిన వారి వద్ద నుంచి బైక్, ఇనుప రాడ్లు, మాస్కులు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.