అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో మంది వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
నగరంలోని చంద్రాయణగుట్ట (Chandrayangutta)లో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో మృతదేహాలు కనిపించాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఆటోలో మూడు ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతోనే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా (Osmania)కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | రాజేంద్రనగర్‌లో..
నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)లో గత నెలలో ఓ వ్యక్తి డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. అహ్మద్ అలీ మొబైల్ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో అలీ మరో ముగ్గురితో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అలీకి తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పోలీసులు రాగానే యువతులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని డ్రగ్స్ టెస్ట్ చేశారు. ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Hyderabad | జోరుగా డ్రగ్స్ దందా
రాష్ట్రంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. మహా నగరం హైదరాబాద్ పాటు మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి లభిస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్లలోపు యువత దీనికి ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. పోలీసులు, ఈగల్ టీమ్ (Eagle Team) చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్ దందా ఆగడం లేదు. పోలీసులు డ్రగ్స్ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అయినా దానికి బానిసలుగా మారిన యువత మారడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్, గంజాయికి బానిస అయినట్లు గుర్తిస్తే డి అడిక్షన్ సెంటర్‌కు తరలించాలి.
