అక్షరటుడే, వెబ్‌డెస్క్ : European Union | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శత్రు దేశాలు, మిత్ర దేశాలు అన్న భేదం లేకుండా ఇప్పటికే దాదాపు అన్ని దేశాలపై టారిఫ్‌లను విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెనిజువెలా దేశాధ్యక్షుడిని బంధించి ఆ దేశానికీ తానే తాత్కాలిక అధ్యక్షుడిని అన్నట్లుగా వ్యవహరిస్తున్న ట్రంప్.. డెన్మార్స్ ఆధీనంలోని గ్రీన్‌ల్యాండ్ (Greenland) విషయంలోనూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు.
దేశ భద్రత విషయంలో గ్రీన్‌లాండ్ తమకు ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై అదనపు సుంకాలను విధిస్తానని హెచ్చరించారు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం అదనపు దిగుమతి పన్ను విధిస్తామన్నారు. ఈ పన్నులను జూన్ 1నుంచి 25 శాతానికి పెంచుతామన్న హెచ్చరికా చేశారు.
European Union | గట్టి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు
యూఎస్ బెదిరింపులను బ్రిటన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ వార్నింగ్‌కు కౌంటర్ ఇచ్చేందుకూ సిద్ధమయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అగ్రరాజ్యం బెదిరింపుల నేపథ్యంలో ఆదివారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈయూ(EU) ప్రతినిధులు సమావేశమయ్యారు. యూఎస్ టారిఫ్స్ ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో అమెరికా టారిఫ్ బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు. అలాగే తమ యూనియన్‌కు చెందిన ఏసీఐ(Anti-Coercion Instrument)ని తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. యూఎస్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ వెళ్తే ‘ట్రేడ్ బజూక’ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చారు.
European Union | ఏమిటీ ట్రేడ్ బజూకా?
ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఈయూ సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిందే ఏసీఐ(ACI). వాణిజ్య బ్లాక్‌మెయిలింగ్‌లు, రాజకీయ ఒత్తిళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దీని ఉద్దేశం. దీనిని ట్రేడ్ బజూకా (Trade bazooka)గా అభివర్ణిస్తారు. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇంతకాలం కాగితానికే పరిమితమైన ఈ ఏసీఐని తొలిసారిగా ఏకంగా అగ్రరాజ్యంపైనే ప్రయోగించేందుకు ఈయూ సిద్ధమవుతోంది. అమెరికాపై దీనిని ప్రయోగిస్తే.. ఆ దేశంపై భారీ టారిఫ్‌లు, ఈయూ దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్ (Single Market Access)ను నిరోధించడం, ఎగుమతులను పరిమితం చేయడం లాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులపైనా నియంత్రణలు విధించవచ్చు. ఈ చర్యలతో యూరోపియన్ యూనియన్‌లో వ్యాపారం చేసే అమెరికా సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.