అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump rash decision | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడుతోంది. దీనికితోడు ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలను ఇరాన్‌కు దూరం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు వేస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ఈ నిర్ణయం పోస్టును చేశారు.
ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాల్లో తుర్కియే, చైనా, యూఏఈ, భారత్, ఇరాక్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సైనిక చర్య చేపడతారని ఓ వైపు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వెలువడింది. ఇరాన్‌పై వైమానిక దాడులు చేపట్టే అవకాశం అయితే ఉందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.
ఇరాన్లో గత నెల 28వ తేదీ నుంచి తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరెన్సీ విలువ కూడా భారీగా పతనమైంది. మరో వైపు ఆ దేశంలో తలెత్తిన ఘర్షణల్లో ఇప్పటివరకు 646 మంది మృతి చెందారు.
Trump rash decision | అమెరికన్లకు అడ్వైజ్..
ఇరాన్‌లోని యూఎస్ పౌరులకు అగ్రరాజ్యం అడ్వైజరీ ఇచ్చింది. ఆ దేశంలో ఉద్రిక్తతలు తీవ్ర హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని, తక్షణమే ఇరాన్‌ను వీడాలని అమెరికన్లకు సూచించింది. కాగా, ఇరాన్‌పై యూఎస్ వైమానిక దాడులు చేపట్టే ప్రమాదం ఉందనే ప్రచారంలో ఉన్నవేళ తాజా హెచ్చరికలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
14న ఉరి..
మరోవైపు ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకారులపై విరుచుకుపడుతున్న ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆందోళనల్లో పాల్గొన్న ఇర్పాన్ సోల్తాని((26 )కి మరణశిక్ష అమలుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్ ప్రాంతంలో జనవరి 8న ఇర్ఫాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన ఇర్ఫాన్‌ను ఉరితీసే ఏర్పాట్లు చేస్తున్నట్లు మానవహక్కుల సంఘాలు వెల్లడిస్తున్నాయి.