అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల కోసం తొలిసారిగా ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీ సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తాజాగా వెల్లడించారు. వైట్‌హౌస్(White House)లో జెలెన్‌స్కీతో జరిగిన భేటీ ఫలప్రదం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని తన సోషల్ మీడియా ట్రూత్‌లో తెలిపారు. నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు.
Donald Trump | సానుకూల చర్చలు..
ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin)తో అలస్కాలో భేటీ అయిన ట్రంప్.. సోమవారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Ukrainian President Zelensky), ఈయూ నేతలు, నాటో అధికారులతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు ముందుకు రావాలని ట్రంప్ సూచించగా, జెలెన్‌స్కీ అంగీకరించారు. రష్యాతో చర్చలకు సిద్ధమని చెప్పారు. దీంతో రెండు దేశాల అధ్యక్షులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సానుకూల వాతావరణంలో యుద్ధ విరమణపై చర్చలు సాగాయని భేటీ ముగిసిన అనంతం ట్రంప్ తెలిపారు. శాంతి స్థాపనకు చర్చల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇరు దేశాల అధ్యక్షులు యుద్ధ విరమణకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక జెలెన్‌స్కీతో చర్చల సందర్భంగా ట్రంప్ నాటో సభ్యత్వ (NATO Membership) అంశాన్ని ప్రస్తావించారు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఉండదని స్పష్టం చేశారు. రష్యా చేతిలో ఉన్న క్రిమియాపై కూడా ఆశలు వదులుకోవాలని కూడా స్పష్టం చేశారు.
Donald Trump | పుతిన్‌కు ట్రంప్ ఫోన్..
జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఫోన్ సంభాషణలో చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించారు. యుద్ధ విరమణకు ముఖాముఖి భేటీ కావాలన్న ట్రంప్ సూచనకు ఆయన అంగీకరించారు. దీంతో త్రైపాక్షిక చర్చలకు అడుగు పడింది. ‘ఓవల్ ఆఫీసులో అతిథులతో గొప్ప సమావేశం జరిగింది. ఉక్రెయిన్ భద్రతపై చర్చించాము. శాంతి నెలకొల్పే అవకాశాలు మెరుగవ్వడం ఆనందంగా ఉంది. ఆ తరువాత పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. జెలెన్‌స్కీతో మీటింగ్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. భేటీ ఎక్కడ అనేది వారిద్దరూ నిర్ణయిస్తారు. ఆ తరువాత అమెరికా, ఉక్రెయిన్, రష్యా త్రైపాకిక్ష సమావేశం కూడా జరుగుతుంది’ అని ట్రంప్ ట్రూత్‌లో వెల్లడించారు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ (Vice President J.D. Vance), విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ త్రైపాక్షిక భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
యుద్ద విరమణకు ముందడుగు పడడంపై ఈయూ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజా పరిణామాలను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, UK ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, NATO సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సహా కీలక యూరోపియన్ దేశాధినేతలు స్వాగతించారు. రెండు వారాల్లో ఇరు దేశాల నాయకులు సమావేశమయ్యే అవకాశముందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. మరోవైపు పుతిన్‌ను నేరుగా సంప్రదించడం ట్రంప్ మంచి ఆలోచనగా భావించారని ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రెండు వారాల్లోపు జెలెన్స్కీని కలవడానికి రష్యా అధ్యక్షుడు సూత్రప్రాయంగా అంగీకరించారని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు.