అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలి వణికిస్తోంది. సాయంత్రం ఆరు అయిందంటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటల వరకు కూడా చలితీవ్రత కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండ వస్తున్నా.. చలి గాలులు వీస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్ (Temperature) నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ సీజన్లో రానున్న పది రోజులు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చంచారు.
Weather Updates | కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్లో 6.8, వికారాబాద్ 7.8, కామారెడ్డి 8.2, నిజామాబాద్ 8.4, మెదక్ 8.4, రంగారెడ్డి 8.4, సిద్దిపేట 8.9, నిర్మల్ 9.0, సిరిసిల్ల 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని హెచ్సీయూలో 8.4, రాజేంద్ర నగర్లో 10.1, అల్వాల్ 10.6, బీహెచ్ఈఎల్ 10.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. ఏపీలోని అల్లూరి ఏజెన్సీపై చలి పంజా విసురుతోంది. మినుములూరు, జి.మాడుగులలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకు 7, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Weather Updates | అప్రమత్తంగా ఉండాలి
చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను చలిగాలులో బయటకు తీసుకు వెళ్లొద్దు. వృద్ధులు సాయంత్రం, ఉదయం వేళలో ఇంట్లోనే ఉండాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం పూట బయట తిరుగొద్దు. దమ్ము వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువగా పని చేయొద్దు.