అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | హాస్టల్ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు (Student Union Leaders) అధికారులను కోరారు. ఈ మేరకు బీసీ, టీజేఎస్, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణి (Prajavani)లో కలెక్టరేట్ ఏవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ (NGOs Colony) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థినులు ఎస్సీ, ఎస్టీ ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో ఉంటున్నారని తెలిపారు.సంబంధిత విద్యార్థినులు హాస్టల్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారని, మార్గమధ్యంలో సాయంత్రం రద్దీగా ఉండే రోడ్డు దాటుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు.
ఆ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థినుల భద్రతా దృష్ట్యా రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సభావత్ వినోద్ చౌహన్ పాల్గొన్నారు.
