అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతను ఓ రైతు.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతడికి ముగ్గురు కూతుళ్లు. కొడుకులు లేకపోవడంతో ముగ్గురు కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే సోమవారం ఆ రైతు అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే కొడుకై ముందుండి నడిచింది. కర్మకాండ నిర్వహించిన తండ్రి రుణం తీర్చుకుంది.
Kamareddy | కామారెడ్డి పట్టణంలో..
ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) సోమవారం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లకుంట్ల సుదర్శన్ కుటుంబంతో సహా కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఊర్లో ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
అతడికి డిగ్రీ, పదో తరగతి, 8వ తరగతి చదివే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సోమవారం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందగా పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తండ్రికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైంది. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి కర్మకాండ నిర్వహించింది. కొడుకులు లేక కూతురే కొడుకై అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
