అక్షర టుడే, గాంధారి : Gandhari | పాముకాటుతో ఏడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామం (Medipalli Village)లోని చందా నాయక్ తండాలో మాయ అనే బాలిక తన తల్లితో పొలానికి వెళ్లింది.
తల్లి పొలంలో పని చేస్తుండగా మాయ ఒడ్డు పైన ఫోన్ చూస్తూ కూర్చుంది. తన తల్లి భోజనం చేసేందుకు పిలవగా మాయ ఒడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున పాముపై కాలువేసింది. దీంతో పాము కాటు (Snake Bite) వేయగా వెంటనే తన తల్లికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె కూతుర్ని తీసుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మాయ మృతి చెందింది. మాయకు తండ్రి లేడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో చందానాయక్ తండా (Chandanayak Thanda)లో విషాద ఛాయలు అలుముకున్నాయి.