అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Toothpaste | దేశంలో ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మొదలు పెడితే మద్యం వరకు ప్రతి దానిని కల్తీ చేసి విక్రయిస్తున్నారు.
తమ లాభాల కోసం కొందరు కల్తీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు టూత్ పేస్ట్ ను కూడా కేటుగాళ్లు కల్తీ చేశారు. ఇప్పటికే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెలతో ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా కోల్గేట్ టూత్‌పేస్ట్‌ను సైతం కల్తీ చేశారు. నకిలీ పేస్ట్ తయారు చేసి కోల్గేట్ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నారు.
Fake Toothpaste | గుజరాత్లో..
గుజరాత్(Gujrath)లోని కచ్‌లో పోలీసులు వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే భారీ రాకెట్‌ను ఛేదించారు. రాపర్ తాలూకాలోని చిత్రోడ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీపై గడోదర్ పోలీసులు(Gadodar Police) దాడి శుక్రవారం దాడి చేశారు. ఈ కంపెనీలో నకిలీ కోల్గేట్(Fake Colgate Toothpaste) తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులను సంప్రదించి అవి అసలు ఉత్పత్తులు కాదని నిర్ధారించారు. నాణ్యత లేని, తక్కువ ధరకు దొరికే వస్తువులతో నిందితులు టూత్‌పేస్ట్ తయారు చేస్తున్నారు. అంతేగాకుండా వాటిని నిజమైన కోల్‌గేట్ ఉత్పత్తులుగా మార్కెట్‌లో విక్రయించారని పోలీసులు తెలిపారు. నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు, ప్యాకింగ్ మెటీరియల్స్, ఉత్పత్తి పరికరాలు సహా సుమారు రూ.9.43 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Fake Toothpaste | నలుగురిపై కేసు
నకిలీ టూత్‌పేస్ట్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాపర్ తాలుకాలోని నలియాటింబా ప్రాంతానికి చెందిన రాజేష్ దియాభాయ్ మక్వానా, సురేష్ మహేష్‌భాయ్ ఉమత్, నట్వర్ అజాభాయ్ గోహిల్, నర్పత్ అలియాస్ నారు దియాభాయ్ మక్వానా అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మోసం, కాపీరైట్ ఉల్లంఘన, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే పదర్థాలు తయారు చేసినట్లు వారిపై కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు ఎక్కడ పంపిణీ చేయబడ్డాయో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.