Homeక్రీడలుTilak Verma | తిల‌క్ వ‌ర్మ‌కి హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం.. పాక్ ఆట‌గాళ్లు నన్ను చాలా...

Tilak Verma | తిల‌క్ వ‌ర్మ‌కి హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం.. పాక్ ఆట‌గాళ్లు నన్ను చాలా అన్నారు, బ్యాట్‌తో స‌మాధానం ఇచ్చా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tilak Verma | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Verma)కు స్వస్థలమైన హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది.

సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamshabad Airport) తిలక్ చేరుకున్న సందర్భంగా ఆయనకి పెద్ద సంఖ్యలో అభిమానులు, క్రీడా శాఖ అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద సందడి వాతావ‌ర‌ణం నెలకొంది. తిలక్‌ను చూడటానికి పెద్దఎత్తున జనం చేరుకోగా, ‘తిలక్.. తిలక్’ అంటూ నినాదాలు చేసారు. అభిమానుల ఉత్సాహాన్ని గ‌మ‌నించిన‌ తిలక్ తన కారు సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి వారికి అభివాదం చేయడం విశేషం.

Tilak Verma | పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలా దేవి తిలక్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. భారత జట్టును తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిపిన ఈ గెలుపులో తిలక్ కీలక పాత్ర పోషించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది అని అన్నారు. ఇక ఆసియా కప్ 2025(Asia Cup 2025) ఫైనల్‌లో భారత్ పాక్‌పై విజయం సాధించడంలో తిలక్ వర్మ ఆడిన 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. శివమ్ దూబేతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపుకి తిప్పాడు. తిల‌క్ కేవ‌లం 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు 69 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడ‌డంతో మ్యాచ్ విజ‌యం సాధించింది.

ఇక తనకు ఎదురైన స్లెడ్జింగ్ గురించి బీసీసీఐ(BCCI) టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను క్రీజులోకి వచ్చినప్పుడు పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా మాటలు మాట్లాడారు. కానీ వారి మాటలకు నేను నా బ్యాట్‌తోనే బదులిచ్చాను. ఇప్పుడు వాళ్లు మైదానంలో ఎక్కడా కనిపించడం లేదు,” అని తిలక్ తెలిపాడు.తిలక్ సోదరుడు తరుణ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, “ఫైనల్‌లో ఆ ఒత్తిడిలోనూ తిలక్ అద్భుతంగా ఆడాడు. మా కుటుంబానికి ఇది గర్వకారణం. అతని విజయంపై మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం,” అని తెలిపారు.హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన తిలక్ వర్మ వ‌ల‌న దేశం సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది ఎంతో గర్వకారణం.

Related News