అక్షరటుడే, ఇందూరు: Local Body Elections | గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని (Commissioner Rani Kumudini) తెలిపారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి, రెండోవిడత నామినేషన్ల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ (postal ballot), బాక్సులు, శాంతిభద్రతను తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో తొలి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు.
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
