అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రజలను కోరారు. గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం సీఎం సోమవారం వనపర్తి జిల్లా (Wanaparthy district) మక్తల్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు ప్రాంత (Palamuru area) అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలకులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు నీరు అందించే ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. సంగం బండ మరమ్మతు కోసం రూ.12 కోట్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు భూసేకరణ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
CM Revanth Reddy | ఐఐటీ ఏర్పాటు చేస్తాం
విద్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు (integrated residential schools) ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఒక ఐఐటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర పురోగతి, దార్శనికతను ప్రపంచ నాయకులకు ప్రదర్శించే లక్ష్యంతో డిసెంబర్ 8–9న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన హైలైట్ చేశారు. 2034 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పాలమూరును రాబోయే దశాబ్దంలో బంగారు పంటల భూమిగా మారుస్తానని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | రూ.151కోట్లతో అభివృద్ధి పనులు
సీఎం సోమవారం రూ.151 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ (Atmakur municipality) పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు, రూ. 121.92 కోట్లతో జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, రూ. 15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు.
