అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం విషయంలో తమపై బురద చల్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికపై ఆయన మంగళవారం తెలంగాణ భవన్లో (Telangana Bhavan) ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టు ఒకవైపు చూసి ఇచ్చినట్లు కనబడుతోందన్నారు. ఆ నివేదికలో ఉన్న ఆరోపణలు బేస్‌లెస్ అన్నారు.
Harish Rao | కమీషన్లు.. కమిషన్ల పాలన
రాష్ట్రంలో కమీషన్లు.. కమిషన్ల పాలన నడుస్తోందని హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. బిల్లులు చెల్లించడానికి డబ్బులు అడుతున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో నిరసన చేపట్టారని గుర్తు చేశారు. ఓ వైపు డబ్బులు దండుకోవడానికి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేస్తోందని విమర్శించారు.
Harish Rao | పోలవరం కూలితే పట్టించుకోలే..
గోదావరి నదిపై ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) మూడు సార్లు కూలిపోయిందని హరీశ్‌రావు అన్నారు. కానీ అక్కడకు ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్టులు ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందని చెప్పారు.
Harish Rao | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Polavaram Project) రాజకీయ కుట్ర చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రిపోర్టును బయట పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికలు ఉండడంతోనే రిపోర్టును బయట పెట్టారని ఆరోపించారు. తమకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇచ్చారని విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao | అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం 60 పేజీల రిపోర్టు బయట పెట్టిందన్నారు. అయితే అది కమిషన్ నివేదికనా.. లేక ప్రభుత్వం ఏమైనా మార్పులు చేసిందా అని ప్రశ్నించారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. వాస్తవాలను అసెంబ్లీ వేదికగా (Assembly Stage) ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
Harish Rao | అది రాజకీయ జోక్యం కాదు
ప్రాజెక్ట్‌లపై రివ్యూ చేయడం ముఖ్యమంత్రి విధి అని హరీశ్ రావు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వేగవంతం చేయాలని నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. కమిషన్ దీనిని రాజకీయ జోక్యంగా పేర్కొనడం సరికాదన్నారు. అది ముఖ్యమంత్రి బాధ్యత అన్నారు. రాజకీయ దురుద్దేశంలో వేసిన కమిషన్ నివేదికలు న్యాయస్థానం, ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు.
Harish Rao | తెలంగాణ ప్రదాయని కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వరప్రదాయని అని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్ తెలంగాణ చరిత్రపుటల్లో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కాళేశ్వరం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిదని ఆయన అభివర్ణించారు.