అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రెండు దశల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. బుధవారం ఉదయం 10 గంటలకు మూడో దశ నామినేషన్లు (Nominations) ప్రారంభం అయ్యాయి.
రాష్ట్రంలో మూడో విడతలో 182 మండలాల్లో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. డిసెంబర్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 17న పోలింగ్ నిర్వహించనున్నారు.
Panchayat Elections | రెండో విడతలో భారీగా నామినేషన్లు
రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు, 38,342 వార్డులకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం రాత్రివరకు నామినేషన్లు స్వీకరించారు. డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్ (Sarpanch) స్థానాలకు 12,479, వార్డు సభ్యుల స్థానాలకు 30,040 నామినేషన్లు వచ్చాయి. మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చాయో అధికారులు నేడు వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. రెండో విడత ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి.
Panchayat Elections | జోరుగా ప్రచారం..
మొదటి విడత ఎన్నికలు ఉన్న గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు శ్రమిస్తున్నారు. అనుచరులతో ఇంటింటికి తిరుగుతూ తమను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల అధికారులు (Election Officers) ఇంకా గుర్తులు కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గుర్తులు వచ్చాక.. పూర్తిస్థాయిలో ప్రచారం చేపట్టనున్నారు.
