అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ చేపట్టింది. వీధి కుక్కల దాడి (stray dog attacks), మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆహారం ఇచ్చేవారు కూడా కారణమేనని కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రతి వీధి కుక్క కాటుకు, సంబంధిత మరణాలకు భారీ పరిహారం విధించగలమని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. జంతు జనన నియంత్రణ (Animal Birth Control) (ఏబీసీ) నిబంధనలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని మందలించింది. కుక్కల బెడద చాలాకాలంగా కొనసాగుతోందని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఈ సమస్య వెయ్యి రెట్లు పెరిగిందని తెలిపింది.
Supreme Court | ఇంటికి తీసుకెళ్లండి..
వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై సైతం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఇంటికి తీసుకెళ్లి పోషించుకోవాలని సూచించింది. అవి బయట తిరుగుతూ, కరుస్తూ ఉంటే ఎందుకు అనుమతించాలని ప్రశ్నించింది. కుక్క కాటు ప్రభావం జీవితాంతం ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని తాము కోరడం లేదని, అయితే ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
కుక్కలకు ఆహారం ఇచ్చేవారు, సంరక్షకులపై వేధింపుల ఆరోపణలను పరిశీలించడానికి కోర్టు నిరాకరించింది. అలాంటి ఫిర్యాదులు శాంతిభద్రతల సమస్యల కిందకు వస్తాయని పేర్కొంది. దానిపై పోలీసులను ఆశ్రయించాలని సూచించింది. కోర్టు తన మునుపటి ఆదేశాలను సవరించాలని కోరుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్‌లతో సహా అనేక పిటిషన్‌లను విచారిస్తోంది. పాఠశాలలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు వంటి సంస్థాగత ప్రాంతాలలో కుక్క కాటు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది.