అక్షరటుడే, కామారెడ్డి: Congress Kamareddy | జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, తగాదాలు లేవని.. సమష్టి కృషితో ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao), లక్ష్మీకాంత్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేల సమక్షంలో డీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, తదితర నాయకులు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు.
Congress Kamareddy | సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, దానికోసం పార్టీలోని సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. రాజకీయాల్లో కొందరికి అవకాశాలు వస్తాయి.. మరికొందరికి రావని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని, పార్టీనే తమ జెండా అని, ఇతర ఏజెండాలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానకు గెలుచుకున్నామని, రాబోయే అన్ని ఎన్నికల్లో ఇదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నూతన కార్యాలయం అందరికి సంబంధించినదని, ఏ ఒక్కరికి పరిమితం కాదని స్పష్టం చేశారు.
Congress Kamareddy | డీసీసీ అధ్యక్షుడి నియామకం చరిత్రాత్మకం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు
డీసీసీ అధ్యక్షుడి నియామకం చరిత్రాత్మకమని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు అవకాశాలు వస్తాయని మరోసారి రుజువైందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు (MLA Lakshmikanth Rao) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పని చేస్తుందన్నారు. చిన్న వయసులో అవకాశం వస్తే సమర్థవంతమైన నాయకత్వం అలవడుతుందన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో డీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగిందన్నారు. డీసీసీ అధ్యక్షుడి బాధ్యత చాలా పెద్దదని, ఓపిక చాలా అవసరమని, సీనియర్ల అనుభవాలను పంచుకుని ముందుకు సాగాలని సూచించారు.
Congress Kamareddy | సమష్టిగా ముందుకు సాగుతా: డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్
డీసీసీ అధ్యక్షుడిగా అందరితో కలుపుకుని సమష్టిగా ముందుకు సాగుతానని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకం కాగానే తమకు పరీక్ష పెట్టినట్టుగా సర్పంచుల ఎన్నికలు వచ్చాయని, జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఎలాంటి గ్రూప్లు, తగాదాలు లేవని, నాయకుడిగా కాకుండా సోదరుడిగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.