అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | పార్టీలో తనకు ఎవరితో అభిప్రాయ బేధాలు, విభేదాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తెలిపారు. బీజేపీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు అనే వార్తలు అవాస్తవమన్నారు. కాగా బండి సంజయ్, ఈటల రాజేందర్ (Etala Rajender) మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాను పార్టీ సిద్ధాంతం, బలోపేతం కోసం పని చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ ఏది చెబితే తాను అది చేస్తానన్నారు. పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తానని తెలిపారు. తనపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయాలన్నారు. తన గురించి, పార్టీ గురించి మంచిగా ఆలోచించాలని సూచించారు.
Bandi Sanjay | రాష్ట్రంలో ఆర్కే పాలన
తెలంగాణలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy), కేటీఆర్ (KTR) (ఆర్కే) పాలన సాగుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ కుటుంబాన్ని జైలులో వేస్తానని, అక్రమంగా సంపాదించిన ఆస్తులు రికవరీ చేస్తానని రేవంత్‌రెడ్డి అన్నట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కనీసం ఆ కుటుంబంలో ఒక్కరికి కూడా టచ్ చేయడం లేదని విమర్శించారు.
ఫార్మూల ఈ రేసు కేసులో గవర్నర్ ఆమోదం రాకపోవడంతో ఇన్ని రోజులు బీజేపీని బద్నాం చేశారన్నారు. ఇప్పడు గవర్నర్ అనుమతి వచ్చిందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి గవర్నర్ అనుమతి రావొద్దని కోరుకున్నట్లు వ్యాఖ్యానించారు. అలా అయితే బీజేపీని బద్నాం చేయొచ్చని చూశారన్నారు. ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను సీఎం ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఇటీవల దేవుడిపై నమ్మకం లేదని దర్శకుడు రాజమౌళి (director Rajamouli) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. భవిష్యత్తులో రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.
