అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | కొందరు సిబ్బంది తీరుతో పోలీస్ శాఖకు (police department) మచ్చ వస్తోంది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు చోరీలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ కానిస్టేబుల్ రోలెక్స్ వాచ్ (Rolex watch) కొట్టేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి ఠాణాలో నుంచి ఫోన్ దొంగతనం చేశాడు.
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ (Mehdipatnam police station) పరిధిలో రైతు బజార్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి రూ.1.75 లక్షల విలువైన ఫోన్‌ను రికవరీ చేసి ఠాణాలోని లాకర్లో భద్రపరిచారు.
Hyderabad Police | లాకర్లో ఫోన్ మాయం
రికవరీ చేసి లాకర్లో పెట్టిన ఫోన్ మాయం అయింది. దీనిపై పోలీసులు విచారణ జరుపగా పోలీస్ డ్రైవర్ శ్రవణ్‌కుమార్ చోరీ చేసినట్లు తేలింది. ఖరీదైన ఆ ఫోన్‌పై కన్నేసిన డ్రైవర్ చాకచక్యంగా దానిని దొంగతనం చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశం అయింది. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన పోలీసులే చోరీలకు పాల్పడితే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Hyderabad Police | రోలెక్స్ వాచ్..
నగరంలో ఇటీవల నకిలీ ఐపీఎస్ అధికారిని ఫిల్మ్ నగర్ పోలీసులు (Film Nagar police) అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో తనిఖీల సమయంలో కనిపించిన రోలెక్స్ వాచ్‌ను కానిస్టేబుల్ మెల్లిగా జేబులో పెట్టుకున్నాడు. వీడియోలో ఆ దృశ్యం రికార్డు కావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
