అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy municipality) పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన పలువురు షబ్బీర్ అలీ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.
Kamareddy | పేదల కోసం చారిత్రాత్మక నిర్ణయం..
పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ (Kamareddy constituency) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రహదారులు, మౌలిక వసతులు, విద్యా-వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరడం ఆనందకరమన్నారు. ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన ప్రతి కార్యకర్త కృషి కీలకమని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ప్రజల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.