అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group-1 Exam | గ్రూప్–1 నియామకాలపై హైకోర్టు (High Court) తీర్పు వాయిదా వేసింది. దీంతో ఉద్యోగాలు సాధించిన వారితో పాటు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) గతంలో గ్రూప్–1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పరీక్షలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై గ్రూప్–1 ర్యాంకర్లు, టీజీపీఎస్సీ (TGPSC) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. తుది తీర్పు మేరకు నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ముగియడంతో గురువారం తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేసింది.
Group-1 Exam | తొలిసారి పరీక్షలు
తెలంగాణ (Telangana) ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి గ్రూప్–1 పరీక్షలు జరిగాయి. 2024 జూన్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించి మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. 2025 మార్చి 10న వీటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్ బెంచ్ పరీక్షలను రద్దు చేయగా.. డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించింది.
Group-1 Exam | 563 మంది భవితవ్యం
గ్రూప్–1 ఫలితాలపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించడంతో ప్రభుత్వం హడావుడిగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. దీంతో 563 మంది కొలువులు సాధించారు. అయితే డివిజన్ బెంచ్ తుది తీర్పు మేరకు నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. దీంతో తన తీర్పులో పరీక్షను రద్దు చేస్తే నియామక పత్రాలు పొందిన వారి కొలువులు పోనున్నాయి. దీంతో న్యాయస్థానం తీర్పు కోసం నియామక పత్రాలు అందుకున్న వారితో పాటు నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.