అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75 దేశాల పౌరులకు వీసాల (US Visa) జారీ నిలిపివేసింది. ఇందులో రష్యా (Russia), బ్రెజిల్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇరాన్ సైతం ఉన్నాయి.
75 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభావిత దేశాల జాబితాలో సోమాలియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్ (Brazil), నైజీరియా, థాయిలాండ్, అలాగే రష్యా ఉన్నాయి. దరఖాస్తుదారుల కఠినమైన పరిశీలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనవరి 21 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
America | దుర్వినియోగం చేస్తున్నారని..
స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన మెమోరాండం ఆధారంగా కాన్సులర్ అధికారులు ప్రస్తుత చట్టానికి అనుగుణంగా వీసాలను తిరస్కరించాలి. దరఖాస్తుదారులను పరీక్షించడం, మూల్యాంకనం చేయడం కోసం విధానాలను సమీక్షించి తిరిగి అంచనా వేయాలి. జనవరి 21 తర్వాత కూడా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ద్వారా తిరిగి మూల్యాంకనం చేయబడే వరకు వీసా ప్రాసెసింగ్ నిలిపి వేస్తారు. విదేశీ పౌరులు ప్రజా ప్రయోజనాలను దుర్వినియోగం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగ్గోట్ పేర్కొన్నారు.