అక్షరటుడే, వెబ్డెస్క్: Plane Crash | ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ట్రైనింగ్ విమానం కూలిపోయింది. నగర శివారులోని చెరువులో విమానం పడిపోయింది.భారత వైమానిక దళ శిక్షణా మైక్రోలైట్ విమానం (Microlight Aircraft) బుధవారం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. KP కళాశాల వెనుక ఉన్న చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ అకస్మాత్తుగా పేలుడు లాంటి పెద్ద శబ్దం వినిపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
Plane Crash | సహాయక చర్యలు
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో సాధారణ స్థితిలోనే ఉంది. కానీ కొద్దిసేపటికే అది కంట్రోల్ కోల్పోయి వేగంగా చెరువులోకి దిగింది. కూలిపోయిన విషయం విన్న వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తాము పాఠశాలలో ఉండగా.. పెద్ద శబ్దం వినిపించిందన్నారు. అక్కడికి పరిగెత్తి కొంతమంది చిత్తడి నేలలో చిక్కుకున్నట్లు చూశామని, చెరువులోకి దూకి ముగ్గురిని రక్షించామన్నారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
పోలీసులు, సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చెరువు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరీక్షను నిర్వహించడానికి వీలుగా విమానాన్ని చెరువు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై వైమానిక దళ అధికారులు (Air Force Officers) దర్యాప్తు చేస్తున్నారు.