అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hiils By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువరించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission).. 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
Jubilee Hiils By Election | 13న నోటిఫికేషన్
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)కు సంబంధించి అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Election Commissioner Gyanesh Kumar) తెలిపారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితం వెల్లడిస్తామన్నారు.
Jubilee Hiils By Election | 407 పోలింగ్ కేంద్రాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 2,07,367 మంది పురుష ఓటర్లు, 1,91,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారని పేర్కొంది. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. ఈసారి ఈవీఎంలపై పార్టీల గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ లో ముద్రించనున్నట్లు పేర్కొంది. అలాగే, ఫాంట్ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
1 comment
[…] ఉప ఎన్నికల(Jubilee Hills by-Election) నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. […]
Comments are closed.