అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad)కు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)లు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌ను కోరింది. ఆయన స్పందించపోవడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. ఆ గడువు ముగిసినా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గతంలో కేటీఆర్ (KTR) స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (BJP MLA Maheshwar Reddy) సైతం పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.
Supreme Court | క్లీన్‌చీట్ ఇవ్వడంపై..
సుప్రీం కోర్టు తీర్పు మేరకు స్పీకర్ ప్రసాద్ విచారణ చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలను విచారించి ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల వీటిపై విచారణ చేపట్టిన కోర్టు చివరి అవకాశం ఇస్తున్నామని ఆ ముగ్గురి విషయంలో సైతం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే తాజాగా మహేశ్వర్‌రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో ఈ పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.