అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి , ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) కమిషన్లు, సిట్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
మంత్రితో ఐఏఎస్ అధికారి (IAS officer) ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఇటీవల ఓ ఛానెల్లో వార్త కథనం ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా అధికార పక్షానికి దగ్గరగా ఉండే టీవీ చానెల్ మంత్రి కథనం వేసిందన్నారు. దాన్ని “ఉటంకించినందుకు” అనేక ఛానెళ్ల మీద, డిజిటల్ మీడియా (channels and digital media) హ్యాండిళ్ల మీద దర్యాప్తు చేయడానికి ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
వార్త వేసిన ఛానెల్ మీద చర్యలు తీసుకోక, సిట్ పేరు మీద ఈ కొత్త డ్రామాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి ఈ సిట్ అన్నారు. ప్రజలు ప్రభుత్వ ఓవరాక్షన్ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థల మీద వేధింపులు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
KTR | వాటిపై సిట్ వేయాలి
కాంగ్రెస్ సర్కారులో ఒక మంత్రి పీఏ, రేవంత్ సహచరుడు కలిసి పారిశ్రామికవేత్తను తుపాకి పెట్టి డబ్బులు డిమాండ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. దాన్ని విచారణ చేయడానికి సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో మంత్రి పీఏ ఇసుక దందాలో కోట్లు దండుకుంటే సదరు ఇసుకాసురుల మీద కేసుల్లేవ్, సిట్ లేదన్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటేసుకుని పోయి వందల కోట్ల భూ కబ్జాకు పాల్పడితే కేసు పెట్టిన పోలీసు అధికారిని బదిలీ చేశారని ఆరోపించారు. వాటిపై విచారణకు సిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.