Homeజిల్లాలుకామారెడ్డిHome Guards | శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర వెలకట్టలేనిది: ఎస్పీ రాజేష్ చంద్ర

Home Guards | శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర వెలకట్టలేనిది: ఎస్పీ రాజేష్ చంద్ర

శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం 63వ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ ఆఫీసర్స్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Home Guards | శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో (District Police Office) హోంగార్డ్స్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు ప్రదర్శించిన పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ (Police Department) నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. దేశ భద్రత, శాంతిభద్రతలు, అత్యవసర పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని పేర్కొన్నారు.

1946లో బొంబాయిలో ప్రారంభమై 1962 చైనా దాడుల అనంతరం దేశవ్యాప్తంగా స్వచ్ఛంద దళాలందరినీ ఒకే సంస్థగా ఏకంచేసి బలోపేతం చేసిన హోంగార్డ్స్ వ్యవస్థను ప్రస్తావిస్తూ, జిల్లాలో చేపట్టిన పలు సంక్షేమ చర్యలను వివరించారు. జిల్లా ఏర్పాటు నుంచి మెడికల్ గ్రాంట్లు, కరోనా సమయంలో ప్రత్యేక సహాయం, సహజ, ప్రమాద మరణాలపై ఎక్స్​గ్రేషియా, ఫ్యూనరల్ ఛార్జీలు, వెల్ఫేర్ గ్రాంట్లు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

జిల్లాలోని 234 మంది హోంగార్డులకు ఉలెన్ జాకెట్స్ పంపిణీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. రోజువారీ విధి భత్యం రూ.921 నుండి రూ.వెయ్యికి, పరేడ్ అలవెన్స్ రూ.100 నుండి రూ.200కు పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలో మరణించిన 23 మంది హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.1.15 కోట్లు విడుదల చేసిందన్నారు. కామారెడ్డి జిల్లాలో (Kamareddy District) ఇటీవల మరణించిన హోంగార్డు శ్రీనివాస్​కు రూ.5లక్షలు మంజూరై త్వరలో కుటుంబానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డ్స్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంకులతో ప్రత్యేకంగా రూపొందించిన మెడికల్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రూ.33 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్, రూ.10వేల అవుట్‌ పేషెంట్ చికిత్స, రెండు ఫుల్ బాడీ చెకప్ ఓచర్లు, కుటుంబ సభ్యులకు వర్తించే వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వంటి ముఖ్య సందర్భాల్లో పనిఒత్తిడి ఉన్నప్పటికీ అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. సాంకేతిక విధులు, సీసీటీఎన్‌ఎస్, రైటర్స్ పనులు, విపత్తు నిర్వహణ, వరదల్లో రక్షణ చర్యల వంటి పలు బాధ్యతల్లో హోంగార్డులు ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రజల ధన, మాన, ప్రాణరక్షణలో నిరంతరం సేవలందిస్తూ పోలీస్​శాఖకు, రాష్ట్రానికి గౌరవం తెస్తున్నారని ప్రశంసించారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా రెయిన్ జాకెట్స్, ఉలెన్ జాకెట్స్, కంటి అద్దాలు పంపిణీ చేయడం సంక్షేమ చర్యల్లో భాగమని తెలిపారు. అనంతరం విధుల్లో ఎలాంటి రిమార్కులు లేకుండా ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ మధుసూదన్, ఆర్ఐలు కృష్ణ, నవీన్, సంతోష్ కుమార్, ఆర్ఎస్సైలు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News