అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Protest | నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. 46 నగరాలు, 21 ప్రావిన్సులలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ (Khamenei)కి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
డిసెంబర్ 28న టెహ్రాన్ బజార్‌లో మూసివేతతో ప్రారంభమైన ఇరాన్ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, రియాద్ విలువ పడిపోవడంతో రెండు వారాల పాటు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
Iran Protest | అణిచివేస్తున్న ప్రభుత్వం
ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం (Iranian Government) అణిచివేస్తోంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 8 మధ్య జరిగిన నిరసనలలో 45 మంది వరకు మరణించారు. మృతుల్లో 29 మంది నిరసనకారులు ఉన్నారు. 8 మంది భద్రత సిబ్బంది సైతం చనిపోయారు. గురువారం ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వ భవనాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. గురువారం రాత్రి టెహ్రాన్, మషద్‌లలో జరిగిన భారీ ప్రదర్శనల సమయంలో భద్రతా సిబ్బందిని వెంబడించారు. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టారు.
దేశంలోని 21 ప్రావిన్సులలో నిరసనలు జరిగినట్లు సమాచారం. నిరసనకారులపై దేశవ్యాప్తంగా జరిగిన అణచివేత చర్యలో మరో 60 మందిని అరెస్టు చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 28 నుంచి 2,277 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు (Internet Services) నిలిపివేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ అధికారులు ప్రజలను చంపడం ప్రారంభిస్తే ఇరాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.