అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi Tour | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్ర ప్రదేశ్ (AP)లోని కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ను పీఎంవో విడుదల చేసింది.
ప్రధాని గురువారం (ఈ నెల 16న) ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సున్నిపెంటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10:55కు శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు ప్రధాని చేరుకుంటారు. మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy)ని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 1:20కి మళ్లీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో సున్నిపెంటకు వెళ్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు నన్నూరు గ్రామంలో జరిగే సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు కర్నూల్ నుంచి తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.
PM Modi Tour | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు (Kurnool)లో సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ని అనుసంధానించే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు, పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్.గుండ్లపల్లి – కనిగిరి బైపాస్‌కు శంకుస్థాపన చేస్తారు.
PM Modi Tour | శ్రీశైలంలో ఆంక్షలు
ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు ఆలయం పరిసరాల్లో మోహరించాయి. శ్రీశైలం రహదారిపై సైతం ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను నిలిపివేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
1 comment
[…] పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ (PM Modi)తో తాను మాట్లాడినట్లు ఆయన […]
Comments are closed.