అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులే (excise officials) బెల్ట్ షాప్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సాక్ష్యంగా జిల్లాలోని ఓ బెల్ట్ షాప్ (belt shop) రికార్డు ధర పలికింది. అది కూడా కామారెడ్డి పట్టణానికి (Kamareddy town) కూతవేటు దూరంలో ఉండడంతో గమనార్హం.
Kamareddy | కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో..
కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో మంగళవారం నిర్వహించిన బెల్టు షాపు వేలానికి ఏకంగా రూ.16.90 లక్షలు పలికిందంటే ఆషామాషీ కాదు. ఒకవైపు మద్య నిషేధం కోసం పలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్ పంచాయతీగా చెప్పుకొనే ఆ గ్రామంలో ఏకంగా రూ.16.90 లక్షలకు బెల్టు షాపు బహిరంగ వేలం వేయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో అనేక గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం వేసిన ఘటనలు ఉన్నాయి. ఏకంగా రూ.40 లక్షలకు పైగా వేలం దక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల అనేక గ్రామాల్లో మద్యం మత్తులో జరిగిన ప్రమాదాలు, ఘటనలను దృష్టిలో ఉంచుకుని మద్యపాన నిషేధం విధిస్తూ మద్యం విక్రయిస్తే భారీగా జరిమానాలు విధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను అరికట్టేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాల్సిన అధికారులు విఫలం అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలం పాటపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.