అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : CP Sai Chaitanya | రాబోయే మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పోలీసులదే కీలక పాత్ర అని సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ పోలీసులు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని చెప్పారు.
CP Sai Chaitanya | ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని సిబ్బందికి సీపీ సూచించారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా వ్యాపించే వదంతులను నియంత్రించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణే మన ప్రధాన లక్ష్యం కావాలని పేర్కొన్నారు.
ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని, సమన్వయంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా, పోలీసు శాఖ (Police Department) ప్రతిష్ఠను మరింత పెంచేలా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.
కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బి.బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్.అంజయ్య, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.