అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వైద్యుని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ ఫైల్ వైద్యుడి నిర్లక్ష్యంతో తారుమారు కాగా.. ఇతరులు వాడాల్సిన మందు తాను వాడగా అవి వికటించి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకోగా ఈ ఘటనలో ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందిపై కేసు నమోదైనట్టు కామారెడ్డి (Kamareddy Police) సీఐ నరహరి (CI Narahari) తెలిపారు.
Kamareddy | దోమకొండ మండలం సంగమేశ్వర్‌కు చెందిన..
సీఐ కథనం ప్రకారం.. దోమకొండ (Domakonda) మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బాలరాజు (70) మూడేళ్ళుగా కిడ్నీ ఫెయిలై నరాల బలహీనత, బీపీ సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి రెగ్యులర్‌గా కామారెడ్డి పట్టణంలోని గీరెడ్డి రవీందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 17న ఆస్పత్రికి వచ్చిన బాలరాజు తన ఫైల్ తీసుకుని ఓపీ చూస్తున్న డా.నవీన్ వద్దకు వెళ్లగా ఆయన డా.రవీందర్ రెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్లగా ఆయన మందులు రాసివ్వడంతో వాటిని తీసుకుని ఇంటికెళ్లాడు. అప్పటి నుంచి బాలరాజు ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.
దీంతో మంగళవారం దోమకొండ ప్రభుత్వ ఆస్పత్రికి (Domakonda Government Hospital), అక్కడినుంచి తిరిగి గీరెడ్డి ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలరాజు ఫైల్ చూసిన వైద్యులు పొరపాటున ఫైల్ మారిందని, ఈ మందులు బాలరాజు వాడాల్సినవి కావని, షుగర్ లెవల్ పూర్తిగా తగ్గిందని మారిపోయిన ఫైల్‌ను తిరిగి ఇచ్చారు. అయితే మందులు తీసుకుని ఇంటికి వెళ్లి వేసుకున్న తర్వాత తిరిగి రాత్రి 11:30 గంటలకు బాలరాజు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేయించారు. రాత్రి ఒంటి గంటకు బాలరాజు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఫైల్ మార్చి వృద్ధుని మృతికి కారణమైన ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందిపై పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వైద్యులు రవీందర్ రెడ్డి, నవీన్, రిషిప్షనిస్ట్ రక్షితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.