అక్షరటుడే, వెబ్‌డెస్క్:Karnataka Congress | కర్ణాటకలో నాయకత్వ మార్పుపై నెలకొన్న రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎలాంటి మార్పు ఉండదని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పటికీ, ఎమ్మెల్యేలు తరచూ ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదని వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు ఉండదని, తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో తాను ఐదు సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికైనప్పటికీ, హైకమాండ్(High Command) తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని వివరించారు.
Karnataka Congress | నా నాయకత్వంలోనే ఎన్నికలకు..
ముఖ్యమంత్రిగా పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తానని సిద్ధరామయ్య తెలిపారు. తన నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను(Assembly Elections) ఎదుర్కొంటామని చెప్పారు. “కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదు. నా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నా సారథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుంది. ” అని ఆయన అన్నారు.
Karnataka Congress | జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు..
కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, జాతీయ రాజకీయాలకు తీసుకెళ్తున్నదన్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆశ లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కర్ణాటక(Karnataka)లోనే ఉంటానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని, పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు “రాయిలా దృఢంగా” అధికారంలో ఉంటుందని అన్నారు. “అవును, నేను అలాగే ఉంటాను. మీకు ఎందుకు సందేహాలు ఉన్నాయి?” తాను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిద్ధరామయ్య అన్నారు.
Karnataka Congress | నాయకత్వ మార్పుపై ఊహాగానాలు?
ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు డీకే శివకుమార్(DK Shiva Kumar)కు పదవి అప్పగించాలన్న డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు. దీనిపై వివాదం రాజుకుంటుండడంతో ఇటీవల పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి స్పష్టత ఇచ్చారు. నాయకత్వ మార్పు ఉండదని, సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. మరోవైపు డీకే శివకుమార్ పలుమార్లు తన మనసులోని మాట బయటపెట్టారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉంటుందని, కానీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు.