HomeతెలంగాణBathukamma | పుట్టింటికి అత్తింటి బతుకమ్మ వాయనం.. సంప్రదాయాన్ని చాటుతున్న అరుదైన ఆచారం..

Bathukamma | పుట్టింటికి అత్తింటి బతుకమ్మ వాయనం.. సంప్రదాయాన్ని చాటుతున్న అరుదైన ఆచారం..

అక్షరటుడే, హైదరాబాద్ : Bathukamma | వివాహ సమయంలో సాధారణంగా ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తింటివారికి కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, తెలంగాణ సంస్కృతి(Telangana Culture)లో దీనికి భిన్నమైన, అరుదైన ఆచారం ఉంది. ఇక్కడ బతుకమ్మ పండుగ సందర్భంగా అత్తింటివారి నుంచే పుట్టింటికి బతుకమ్మ వాయనం ఇవ్వడం అనాదిగా వస్తున్న గొప్ప సంప్రదాయం.

తొలి బతుకమ్మ వేడుక:

పెళ్ళైన తరువాత వచ్చే తొలి బతుకమ్మ(Tholi Bathukamma) పండుగను అత్తింటివారు ప్రత్యేకంగా భావిస్తారు. ఈ సందర్భంగా వారు 5 నుంచి 11 రకాల బతుకమ్మలను తయారు చేసి పుట్టింటికి తీసుకెళతారు. బతుకమ్మలతో పాటు, పుట్టింటివారికి వాయనంగా వివిధ రకాల పిండి వంటలను అందిస్తారు. వీటిలో ముఖ్యంగా కొర్రలు (కోలలు), నువ్వులు, గోధుమలు, పెసలు, బియ్యం, మినుములతో చేసిన వంటకాలు ఉంటాయి.

అంతేకాకుండా, అత్తింటివారు పుట్టింట్లో ఉన్న ఇంటిల్లిపాదికి నూతన వస్త్రాలను అందించి గౌరవిస్తారు. ఈ ఆచారం అల్లుడి ఇంటి నుంచి మామగారి ఇంటికి బహుమతులు పంపే ఒక అపురూపమైన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

వెండి బతుకమ్మ విశిష్టత:

అత్తింటివారు తీసుకువచ్చిన ఈ ప్రత్యేక బతుకమ్మలను కోడలి పుట్టింట్లోనే మూడు నుంచి ఐదేళ్ల పాటు ఉంచుతారు. ఈ కాలంలో పెద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా వాటితోనే ఆడుతారు. చివరి రోజున, పేపర్ (కాగితం) పూలతో చేసిన బతుకమ్మను నిమజ్జనం చేసి, వెండి బతుకమ్మ(Silver Bathukamma)ను మాత్రం తమతో పాటు అత్తింటికి తీసుకెళతారు.

ఇటీవలి కాలంలో, అనేకమంది మహిళలు వెండి బతుకమ్మలను విదేశాలకు సైతం తీసుకెళ్ళి అక్కడ పండుగను జరుపుకోవడం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, ఆచార కట్టుబాట్ల విలువలను, తెలంగాణ ఆడబిడ్డల అనుబంధాన్ని సరిహద్దులు దాటి ప్రపంచానికి చాటి చెబుతోంది.