అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kite Festival | హైదరాబాద్ (Hyderabad)లో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
కైట్ ఫెస్టివల్‌తో పరేడ్ గ్రౌండ్స్‌లో ఆకాశం ప్రకాశవంతమైన రంగుల కాన్వాస్‌గా మారిపోయింది. శతాబ్దాల చరిత్ర కలిగిన పండుగలు రాష్ట్ర గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి ముఖ్యమైనవని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పేర్కొన్నారు. 25 రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారని చెప్పారు. క్రీడలు స్వేచ్ఛ, ఆనందాన్ని పెంపొందిస్తాయన్నారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గాలిపటాల తయారీని ప్రోత్సహించే ప్రణాళికలను మంత్రి ప్రకటించారు. దిగుమతి నుంచి స్థానిక తయారీకి మారడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు.
Kite Festival | అలా చేస్తే మానసిక విశ్రాంతి
ప్రజలు ప్రయాణాన్ని వారి జీవనశైలిలో అనుసంధానించాలని మంత్రి జూపల్లి సూచించారు. ప్రతి ఒక్కరూ నెలకు కనీసం రెండు రోజులు పర్యాటక ప్రదేశాలను సందర్శించాలన్నారు. అలా చేస్తే మానసిక విశ్రాంతిని లభించడమే కాకుండా స్థానిక కళాకారులు, చేతివృత్తులవారికి ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విభిన్నమైన వంటకాలను ప్రదర్శించిన స్వీట్ ఫెస్టివల్ (Sweet Festival) స్టాల్స్‌ను సందర్శించారు.