అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | కూకట్పల్లి నల్ల చెరువు కట్టపై బుధవారం కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పతంగులు ఎగురవేసి సందడి చేశారు.
కూకట్పల్లిలోని (Kukatpally) నల్ల చెరువును హైడ్రా పునరద్ధరించిన విషయం తెలిసిందే. ఆక్రమణలకు గురైన ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా అక్కడ స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ గాలిపటాలు ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. 2024 సెప్టెంబరులో ఇక్కడ చెరువు విస్తరణ చేపట్టినప్పుడు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయని.. నేడు పండగ వాతావరణం నెలకొందన్నారు. కబ్జాలతో 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్ల చెరువును 30 ఎకరాలకు విస్తరించామని తెలిపారు. 10 అడుగుల మేర పేరుకుపోయిన పూడికను తొలగించి చెరువు మురికిని వదిలించామని చెప్పారు. ఇక్కడకు 5 కిలోమీటర్ల నుంచి వచ్చి వాకింగ్ చేస్తున్నట్టు పలువురు చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. షటిల్ కోర్టు, కమ్యూనిటీ హాల్, యోగా కేంద్రం, సైకిల్ ట్రాక్ (cycle track) చెరువు వద్ద అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
Hydraa | మరో 14 చెరువులను..
హైడ్రా మొదటి విడత 6 చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని కమిషనర్ తెలిపారు. మరో 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. మరో 14 చెరువుల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నగరంలో 100 చెరువులు అభివృద్ధి జరిగితే చాలావరకు వరదలను నియంత్రించవచ్చు అని పేర్కొన్నారు. మురికి కూపాలుగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు.