అక్షరటుడే, వెబ్డెస్క్ : High Court | సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల ముందు పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఇటీవల పలు సినిమాల టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ (The Rajasab) టికెట్ రేట్ల పెంపునకు ఓకే చెప్పగా.. కోర్టు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టింది. రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేసింది. ఎన్ని సార్లు చెప్పినా రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం మళ్లీ మన శంకర వరప్రసాద్ (Mana Shankara Varaprasad) సినిమా టికెట్ రేట్లను పెంచింది. దీనిపై గతంలో పిటిషన్ దాఖలు కాగా.. తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది.
High Court | కోర్టు ధిక్కరణ కేసు
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ రేట్లపై న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టులో సవాల్ చేశారు. ధరల పెంపు ఉత్తర్వులను కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకురాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. కాగా ప్రభుత్వం హడావుడిగా టికెట్ రేట్లను (Ticket Rates) పెంచుతూ నిర్ణయం తీసుకుంటోంది. రాజాసాబ్ మూవీకి అర్ధరాత్రి అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.