అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T-Hub | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. టీ హబ్‌లోకి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలిపి వేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాయదుర్గం (Rayadurgam)లో టీ హబ్ ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. దీనిని పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఇందులో ఎన్నో స్టార్టప్‌లు పురుడు పోసుకున్నాయి. ఎంతోమంది ఔత్సాహికవేత్తలు పారిశ్రామికవేత్తలుగా మారారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు ప్రభుత్వ కార్యాలయాను టీ హబ్‌లోకి మార్చాలని నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాజాగా వెనక్కి తగ్గింది.
T-Hub | అద్దె భవనాల్లోని కార్యాలయాలు
నగరంలో అనేక కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌ల్లోకి మార్చాలని గతంలోనే అధికారులకు ఆదేశించింది. ఇందులో భాగంగా బేగంపేటలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని, శేరిలింగంపల్లి, గండిపేట్, రంగారెడ్డి జిల్లా (Rangareddy District) రిజిస్ట్రేషన్ కార్యాలయాలను టీ హబ్‌లోకి తరలించాలని గతంలో ఆదేశించింది. టీ హబ్‌లో 60వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించాలని నిర్ణయించింది.
T-Hub | విమర్శలు రావడంతో..
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన టీ హబ్‌లోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే వాతావరణం దెబ్బతింటుందని విమర్శలు వచ్చాయి. అక్కడ ప్రజల రద్దీ పెరగడంతో అంకుర సంస్థల ఏర్పాటు తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో టీ హబ్ ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు. విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్‌లోకి కార్యాలయాల తరలింపు నిర్ణయాన్ని నిలిపి వేసింది. టీ-హబ్ ప్రాంగణంలోని ప్రతి అంగుళం కూడా స్టార్టప్‌లు, టెక్ సంస్థలు, ప్రారంభ దశ కంపెనీలను ప్రోత్సహించడానికి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) స్ఫూర్తితో యూనికార్న్ కంపెనీలను సృష్టించడం దీని లక్ష్యం అని తెలిపింది. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించాలని ఆదేశించింది.