అక్షరటుడే, భీమ్గల్: Minister Seethakka | రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలో (Bheemgal Municipality) రూ.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని వెల్లడించారు.
Minister Seethakka | మహిళా సంక్షేమానికి పెద్దపీట
గడచిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.30వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 60ఏళ్లు నిండిన మహిళలకు సంఘాల్లో సభ్యత్వం ఉండకూడదని ఆంక్షలు పెట్టిందని, కానీ తమ ప్రభుత్వం వయసుతో సంబంధం లేకుండా సభ్యత్వం కల్పించడమే కాకుండా బ్యాంకు ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తోందని గుర్తుచేశారు. గత పాలకులు పదేళ్లలో మహిళలకు వడ్డీ రాయితీలు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.
Minister Seethakka | ప్రత్యేక నిధులతో భీమ్గల్ అభివృద్ధి
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడి భీమ్గల్ పట్టణానికి మరిన్ని ప్రత్యేక నిధులు తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సేవచేస్తున్న ముత్యాల సునీల్ కుమార్(Mutyala Sunil reddy) కార్యదక్షతను మంత్రి అభినందించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పెచ్చరిల్లిన గంజాయి సంస్కృతిని రూపుమాపి యువతను సన్మార్గంలో పెడుతున్నామని చెప్పారు. భీమ్గల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, నాయకులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, పర్శ అనంత్ రావు, వాక మహేష్, నాగేంద్రబాబు, సుంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.