అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని పాత వీక్లీ మార్కెట్‌లో పట్టణ డ్వాక్రా, మెప్మా మహిళలకు (DWACRA and MEPMA women) స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
Mla Pocharam | కుటీర పరిశ్రమల ద్వారా..
కుటీర పరిశ్రమల ద్వారా మహిళలు నెలవారీ ఆదాయం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందని పోచారం అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని (Hyderabad) ఒక ప్రైవేట్ పరిశ్రమను సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను తీసుకువచ్చి, యంత్రాల పనితీరుపై మహిళలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు.
మహిళలు తమకు నచ్చిన రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని, ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్), అలంకరణ వస్తువులు (కాస్మెటిక్స్), వస్త్రాలు, చేతివృత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా స్వయం ఉపాధి పొందవచ్చని పోచారం సూచించారు. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జంగం గంగాధర్, నార్ల సురేష్, పిట్ల శ్రీధర్, ఎజాజ్, గోపాల్ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.