అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal Elections | తెలంగాణ (Telangana)లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.
కాగా.. ఈ జాబితాలో పలుచోట్ల పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. కాగా.. వీరిలో పురుష ఓటర్లు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉండగా.. ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నారు.
Municipal Elections | అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో..
ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసిన తుది జాబితాలో అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డులు ఉండగా.. అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 వార్డులు ఉండగా.. 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,69,679 మంది, మహిళలు 1,70,858 మంది ఉన్నారు.
Municipal Elections | 20వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ?
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 12న తుది జాబితా విడుదలైన నేపథ్యంలో జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా ఆధారంగా అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నారు.