అక్షరటుడే, ఇందూరు: RTI | సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో పక్కాగా అమలు చేస్తూ.. జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. స.హ.చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో (Zilla Parishad) బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బోధన్ (Bodhan), ఆర్మూర్(Armoor) డివిజన్ స్థాయిలో గురువారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
RTI | ప్రతి కార్యాలయంలో బోర్డులు ప్రదర్శించాలి
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి వివరాలతో బోర్డును విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులు మారిన సందర్భాల్లో వెంటనే ఆ సమాచారాన్ని అప్డేట్ చేయాలన్నారు. ఆర్టీఐ (RTI) అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను పొందుపర్చాలని సూచించారు.
4(1బి) రిజిస్టర్లోని సమాచారంతో కూడిన బుక్లెట్ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స.హ.చట్టం అమలుపై సమీక్ష జరపాలని ఆదేశించారు. దరఖాస్తులను నిర్ణీత కాలవ్యవధిలోపు పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తుదారు రెండో అథారిటీకి వెళ్లే ఆస్కారం లేకుండా కోరిన సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో అందించాలన్నారు.
సమాచారం అందించే సమయంలో విచక్షణతో వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనవసర కాలయాపన చేస్తే జరిమానాలకు గురి కావాల్సి వస్తుందని.. ఇది పదోన్నతులు, ఇంక్రిమెంట్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
అనంతరం రిసోర్స్ పర్సన్లు కిషన్, కృష్ణాజీ స.హ.చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

