అక్షరటుడే, భీమ్గల్: BRS Bheemgal | మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి సీతక్క (Minister Seethakka) చేత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. భీమ్గల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, మాజీ ఎంపీపీ మహేష్ మాట్లాడారు.
BRS Bheemgal | ఎన్నికల కోసమే చీరల పంపిణీ..
గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే పట్టణంలో మహిళలకు చీరలు పంచడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు.
BRS Bheemgal | ప్రశాంత్ రెడ్డి చేసిన పనులే ఆధారం..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) గతంలో మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేక కాంగ్రెస్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం మంత్రి సీతక్కతో ఆ పనులనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. భీమ్గల్ గడ్డ ప్రశాంత్ రెడ్డి అడ్డా అని, 12 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డికి (Mutyala Sunil Reddy) రాజకీయ అవగాహన లేదని, ఆవేశం తప్ప ఆలోచన లేదని విమర్శించారు. జిల్లాలో గంజాయి నిర్మూలన చేశామని చెబుతున్న సునీల్ రెడ్డి.. ఇటీవల పెద్దఎత్తున గంజాయి పట్టుబడిన ఘటనలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.