అక్షరటుడే, కామారెడ్డి: BRS Kamareddy | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడే మాటలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ (Gampa Govardhan), జాజాల సురేందర్ (Jajala Surender), హన్మంత్ షిండేలు (Hanmant Shinde) మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
BRS Kamareddy | ప్రజా ప్రభుత్వం పేరుతో అరాచకాలు..
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రజా ప్రభుత్వం పేరుతో అరాచకాలు సృష్టిస్తూ సమాజాన్ని విడదీసే విధంగా సీఎం మాటలు ఉన్నాయన్నారు. ఈనెల 18న ఖమ్మంలో టీడీపీని కేసీఆర్ లేకుండా చేశాడని, రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలని మాట్లాడడం చూస్తే సీఎం ఎంత అసహనంతో ఉన్నాడో అర్థం అవుతుందన్నారు. బీఆర్ఎస్పై మాట్లాడే అర్హత సీఎంకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప పోరాట యోధుడు, రాష్ట్ర మొదటి సీఎం కేసీఆర్ మీద రెండేళ్లుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు ప్రజాపాలన ప్రభుత్వమని చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Kamareddy | రేవంత్ రెడ్డి ఖబడ్దార్..
రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. ఇకనైనా ఈ మాటలు మానుకో గంప గోవర్ధన్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై చిన్నచిన్న విషయాలకే కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను సీఎం అని ఏది చెప్తే అది నడుస్తుందని, ప్రతిపక్షం ఉండొద్దని.. బీఆర్ఎస్ ఉండొద్దని సీఎం అనుకుంటున్నాడన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే చేసి ఇవాళ ఏ పార్టీలో ఉన్నావో ఆలోచించుకోవాలని సూచించారు. నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కూల్చారని గుర్తు చేశారు. ఇవాళ టీడీపీ గురించి ఏం మాట్లాడుతున్నావని నిలదీశారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి టిడిపి గిరించి మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
BRS Kamareddy | దృష్టి మళ్లించేందుకు..
ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దేశంలోనే నంబర్–1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన నేత కేసీఆర్ (KCR) అని, కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్రలో నిలిచే వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని మాటలు అంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలకు సుపరిపాలన కోసం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, రెండేళ్లలో జిల్లాకు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. షబ్బీర్ అలీకి కామారెడ్డి అభివృద్ధి ఇవాళ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. నాటి సీఎం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తే నిధులు ఇవ్వకుండా నిర్లక్యం చేస్తున్నారని, 330 పడకల ఆస్పత్రి వస్తుందని, రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందుతుందని కేసీఆర్ ఆలోచించారన్నారు. సీఎం తన భాష మార్చుకోవాలని సూచించారు. వెంటనే సీఎంపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని, డీజీపీ, ఎస్పీలను కోరుతున్నామన్నారు.
BRS Kamareddy | సీఎం మాటలు గల్లీ రౌడీలా ఉన్నాయి..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు గల్లీ రౌడీలా ఉన్నాయని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును దుర్భాశలాడుతున్నారన్నారు. తొమ్మిదిన్నరేళ్లు దేశంలో ప్రజలు మెచ్చుకునేలా కేసీఆర్ పాలన సాగిందన్నారు. రాష్ట్ర పరువు తీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ముందుకు సాగేలా పాలన ఉండాలని, ఇలాంటి మాటలు పునరావృతం అయితే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
BRS Kamareddy | టీడీపీని తుడిచి పెట్టిందే రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి టీడీపీకి మచ్చ తెచ్చారని, తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టేలా చేసింది రేవంత్ రెడ్డేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సీఎం మాటలను ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారని, ఆయన హోదాను దిగజార్చేలా మాటలు ఉన్నాయన్నారు. ఆరు గ్యారెంటీలు మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిట్టడానికే రెండేళ్లు గడిచిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పోతున్నారన్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎంకు విలువలు లేవా.. మీ స్థాయి ఇదేనా.. అని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి రావాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఏనాడైనా బీఆర్ఎస్ వస్తుందని ఊహించారా.. తెలంగాణ వస్తుందని పసిగట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ ను తొలగించలేరన్నారు. టీడీపీని బొందపెట్టి కాంగ్రెస్లోకి వచ్చారని, మళ్లీ జీవితంలో కాంగ్రెస్కు ఓటేయకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిట్ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని, ఏడాదికి రూ.20 వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గద్దెలను ముట్టి చూడాలని, సీఎం ఎక్కడ తిరుగుతాడో చూస్తామన్నారు. ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎంకు సూచించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే బ్రిటిష్ పాలన బాగుండే అనే వాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.