అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sanchar Saathi | ‘సంచార్ సాథీ’ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫోన్ల నుంచి డిలీట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో (New Smartphones) సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం అన్ని ఫోన్ల తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి.
ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభలను మంగళవారం స్తంభింపజేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సంచార్ సాథి యాప్‌ను తొలగించవచ్చని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Minister Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. “మీరు సంచార్ సాథి వద్దనుకుంటే మీరు దానిని తొలగించవచ్చు. ఇది ఐచ్ఛికం… ఈ యాప్‌ను అందరికీ పరిచయం చేయడం మా విధి. దానిని వారి పరికరాల్లో ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టం” అని ఆయన సభలో ప్రకటన చేశారు.
Sanchar Saathi | ఉభయ సభల్లో దుమారం..
సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) అంశంపై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఉభయ సభల్లో ఇదే అంశంపై చర్చ జరిగింది. సంచార్ సాథీ యాప్‌పై విస్తృత చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్, శివసేన, యూబీటీ, టీఎంసీ వంటి విపక్ష పార్టీలు యాప్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. సంచార్ సాథీ యాప్.. ఫోన్ యూజర్ల కదలికల్ని, మెసేజెస్, కాల్స్ మానిటర్ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది దారుణమైన పరిణామమని.. భవిష్యత్‌లో నియంతృత్వానికి దారితీస్తుందని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గోప్యతను ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
Sanchar Saathi | డిలీట్ చేసుకోవచ్చు..
విపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక ప్రకటన చేసింది. అవసరం లేదనుకుంటే యాప్‌ను ప్రజలు డిలీట్ చేసుకోవచ్చని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంచార్ సాథీ యాప్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు.
